KTR Campaign: రేవంత్, ఈటలకు మాజీమంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్.. ఇద్దరికి సవాళ్ల పర్వం
KT Rama Rao Strong Counter To Revanth Reddy And Eatala Rajender: కేంద్రంలోని బీజేపీని, తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మాజీ మంత్రి కేటీఆర్ విమర్శల దాడి తీవ్రం చేశారు. తాజాగా రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
KT Rama Rao: రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ లక్ష్యంగా మాజీ మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి మల్కాజిగిరికి చేసిందేమీ లేదని.. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ కూడా కేంద్రం నుంచి రూపాయి తెచ్చిందేమీ లేదని చెప్పారు. మోసం చేస్తున్న వీరిని ఓడించి బీఆర్‌ఎస్ పార్టీని మల్కాజిగిరి సీటులో గెలిపించాలని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
Also Read: Kadiyam Srihari: కేసీఆర్‌పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. ఇదే నా చివరి ఎన్నిక
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మేడ్చల్‌లో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. మంచి సేవ చేసే గుణమున్న రాగిడి లక్ష్మారెడ్డిని మనం గెలిపించుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని తీసుకొచ్చి మన మీద రుద్దే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. మల్కాజిగిరిలో బీజేపీతోనే తమకు పోటీ అని స్పష్టం చేశారు. పదేళ్లలో మోడీ చేసిందేమిటీ? అని ప్రశ్నించారు. పదేళ్లలో కేసీఆర్ పాలనలో చేసిందేంటో ఒక్కసారి చూసుకోవచ్చు అని చెప్పారు.
Also Read: Warangal MP Ticket: బీఆర్‌ఎస్ పోయి కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య.. సిట్టింగ్ ఎంపీకి భారీ షాక్
'కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశారు. వాటిని మేము చెప్తాం. ఈటల రాజేందర్ దమ్ముంటే మోడీ మల్కాజిగిరికి ఏం చేసిండో చెప్పి ఓట్లు అడగాలి' అని కేటీఆర్ సవాల్ విసిరారు. బీజేపీ మల్కాజిగిరికి చేసింది గుండుసున్నా అని తెలిపారు. రోడ్ల అభివృద్ధికి కోసం పదేళ్లు కంటోన్మెంట్‌లో భూములు కావాలని అడిగితే పట్టించుకోలేదని గుర్తుచేశారు. తెలుగు అధికారి గిరిధర్ అనే వ్యక్తి ద్వారా ఆ ఫైల్ కదిలిందని చెప్పారు. కానీ ఇది కూడా రేవంత్ రెడ్డి తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'మందికి పుట్టిన బిడ్డలను నా బిడ్డలని చెప్పుకునే తత్వం రేవంత్ రెడ్డి. సిగ్గు, శరం ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులను నేను చేశానని చెప్పుకోవటానికి. మొన్నటి దాకా బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అన్న రేవంత్ ఇప్పుడు గత గవర్నమెంట్ బీజేపీతో లొల్లి పెట్టుకుందంటున్నావ్' అని తెలిపారు. కాంగ్రెసోళ్లు పచ్చి మోసగాళ్లు అని ధ్వజమెత్తారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పిన ఉద్యోగాలు ఇయ్యాలే అని వివరించారు.
'కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు రేవంత్ రెడ్డి నీ ఖాతాలో వేసుకుంటే విద్యార్థులు చైతన్యవంతులు మీ అంతు చూస్తారు' అని కేటీఆర్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి, బీజేపీ మల్కాజిగిరికి చేసింది గుండుసున్నా అని గుర్తు చేశారు. కానీ మోడీ దేవుడని బండి సంజయ్ అంటాడు. అసలు మోడీ ఎవరికీ దేవుడు? అని ప్రశ్నించారు. 'ధరలు పెంచినందుకా, మహిళలకు దేవుడా, ఏం అభివృద్ధి చేసిండని దేవుడు' అని నిలదీశారు.
ఈటల రాజేందర్‌పై కేటీఆర్ విరుచుకుపడ్డారు. 'రుణమాఫీ చేయలేదని మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌కు సిగ్గు ఉందా? నువ్వు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడే కేసీఆర్ రూ.16 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసింది' అని గుర్తు చేశారు. మోడీ మాత్రం రూ.14 లక్షల కోట్ల రుణమాఫీ పెద్ద పారిశ్రామిక వేత్తలకు చేశాడని ఆరోపించారు. ఏం ముఖం పెట్టుకొని బీజేపీ ఓట్లు అడుగతదో ఈటల చెప్పాలని సవాల్ విసిరారు. మల్కాజిగిరిలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా బీజేపీకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇక్కడ కాంగ్రెస్‌కు ఓటేస్తే.. బీజేపీకి ఓటేసినట్లే అని చెప్పారు.
'పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లే మొట్ట మొదటి వ్యక్తి జంపింగ్ జపాంగ్ రేవంత్ రెడ్డే. రేవంత్ రెడ్డి బీజేపీలో వెళ్లటం పక్కా' అని కేటీఆర్ మరోసారి పునరుద్ఘాటించారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలనీ నేరవేర్చాలని సవాల్ విసిరారు. రుణమాఫీ చేస్తా అన్న పొంకనాల రెడ్డి రేవంత్ రెడ్డి ఎక్కడ? అని ప్రశ్నించారు. రుణమాఫీ అయినవాళ్లు కాంగ్రెస్‌కు ఓటు వెయ్యండి.. మిగతా వాళ్లు బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని సూచించారు. రేవంత్ రెడ్డి పొంకనాల పోశెట్టిగా అభివర్ణించారు.
మహిళలకు రూ.2,500, గ్రూప్ 2 నోటిఫికేషన్, కరెంట్ కోతలు తదితర విషయాలపై రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు అని రేవంత్ రెడ్డి ముందే చెప్పాడని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పు జరగకుండా చూసుకోవాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో సెక్యులర్ పార్టీ ఉందంటే అది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. మల్కాజిగిరి ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook